చెవి కర్ణభేరి శస్త్రచికిత్స
Table of contents
చెవి నిర్మాణము:
చెవి మన శరీరం లో అతి ముఖ్యమైన భాగము మరియు మనకున్న ఐదు ఇంద్రియాలలో(senses) ఒకటి. చెవి మనకు శబ్ధాలను గ్రహించడానికే కాకుండా మన శరీరం సమతాస్థితిలో (body balance) ఉండేలా చూసుకుంటుంది. చెవి నిర్మాణం మూడు భాగాలుగా విభజించబడింది అవి :
- బాహ్య చెవి (External ear /Outer ear)
- మధ్య చెవి (Middle ear)
- లోపల చెవి Internal ear /Inner ear)
చెవి లోపల కర్ణభేరి(eardrum) బాహ్య చెవికి మరియు మధ్య చెవికి మధ్యలో ఉంటుంది. శబ్ధ తరంగాలను (sound waves) కర్ణభేరి గ్రహించి మన మెదడుకు (brain) పంపిస్తాయి , అప్పుడు మనం ఆ శబ్ధాలను గ్రహిస్తాము. చెవి లోపలి కర్ణభేరి దెబ్బతిన్నప్పుడు మనకు వినికిడి శక్తి తగ్గుతుంది. చెవి వినికిడి శక్తి తగ్గింది అనుకున్నప్పుడు వెంటనే చెవి,ముక్కు,గొంతు,(ENT) వైద్య నిపుణుడిని కలిసి తగిన శస్త్ర చికిత్స పొందాలి.
అసలు చెవిలో కర్ణభేరికి ఎందుకు రంధ్రం పడుతుంది?
చెవి లోపలి కర్ణభేరి ఒక పల్చని పొరలా ఉంటుంది, ఆ పొర దెబ్బతినడానికి లేదా రంధ్రం పడటానికి చాలా కారణాలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన కారణాలు:
జలుబు లేదా సయినస్(sinus): జలుబు లేదా సయినస్ వచ్చినపుడు సరైన చికిత్స తీసుకోకపోవడం వలన మన ముక్కుని, చెవిని కలిపే యూస్టేషియన్ ట్యూబ్ (eustachian tube) మూసుకుపోయి మన ముక్కు దిబ్బడ పడుతుంది. కొన్ని సందర్భాలలో ముక్కు దిబ్బడ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ను కలిగించి మన కర్ణభేరిని బాగా పల్చబడేలా చేస్తుంది. అప్పుడు విపరీతమైన చెవి నొప్పితో పాటు కర్ణభేరికి రంధ్రం పడే అవకాశం ఉంది.
ముక్కు దూలం వంకర వలన: కొంతమంది లో వివిధ కారణాల వలన ముక్కు కుడి రంద్రాన్ని ఎడమ రంద్రాన్ని వేరు చేసే దూలం వంకర అవడం, లేదా ముక్కు దగ్గర ఉన్న మాంసం/ కండ పెరగడాన్ని డీవియేటెడ్ నాసల్ సెప్టం (Deviated Nasal Septum -DNS) అంటారు. DNS వలన యూస్టేషియన్ ట్యూబ్ (eustachian tube) మూసుకుపోయి లోపల ప్రతికూల వత్తిడి (negative pressure) కలిగి కర్ణభేరికి రంధ్రం పడుతుంది.
దెబ్బ తగలటం వలన(trauma):
చెంప మీద లేదా చెవి మీద గట్టిగా దెబ్బ తగిలినపుడు ఆ దెబ్బ కారణంగా పల్చని కర్ణభేరికి కన్నం పడే అవకాశం ఉంది. చెవిలో పుల్లలు, బడ్స్, పిన్నీసులు వంటివి పెట్టి తిప్పినప్పడు అవి కర్ణభేరికి తగిలి రంద్రాన్ని ఏర్పరుస్తాయి. కొన్ని సందర్భలలో పైన చెప్పిన కారణాల వల్ల చెవి లోంచి రక్తం కారడం లేదా తరచూ చెవిలో జోరీగ లాంటి శబ్ధం(tinnitus) వినిపించడం కూడా జరుగుతుంది.
బారోట్రామ: మనం సరైన జాగ్రత్తలు పాటించకుండా స్కూబా డైవింగ్(scuba diving), లోతైన నదులు, సముద్రాల్లో డైవింగ్ కి(deep sea diving) వెళ్ళినప్పుడు నది లోపల నీటి వత్తిడి(pressure) మన మీద పడుతుంది. మనం ఒక్కసారిగా నేల మీద నుంచి లోతైన నీటిలోకి వెళ్ళడం వలన మన చెవులలో ఉండే యూస్టేషియన్ ట్యూబ్ పై నీటి ఒత్తిడి పెరిగి అది మన కర్ణభేరిమీద ప్రభావం చూపతుంది ఆ విధంగా కర్ణభేరికి రంధ్రం పడుతుంది.
పెద్ద శబ్ధాలు: మనం అకస్మాత్తుగా ఏదైనా పెద్ద శబ్ధాలని, మ్యూజికల్ కన్సర్ట్ ని లేదా పాటలను హెడ్ఫోన్లో ఎక్కువ శబ్దాలతో విన్నప్పుడు కూడా మన కర్ణభేరికి రంధ్రం పడుతుంది. ముఖ్యంగా బొగ్గు గణులలో,క్వారీల్లో, బాంబులు వినియోగించే ప్రదేశాలలో, ఎక్కువ శబ్ధాలిచ్చే యంత్రాల వద్ద వృత్తి రీత్యా పనిచేసే వాళ్ళకి కూడా అధిక శబ్ధాల వల్ల కర్ణభేరి కన్నం పడే అవకాశం ఉంది. వీళ్ళు ఆయా పనులు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చిన్న పిల్లలు తరచూ జలుబు, సైనస్, అడినాయిడ్స్(adenoids/ కొయ్యగడ్డలు), టాన్సిల్స్(tonsils/ గవద బిళ్ళలు) వంటి అనారోగ్యాలకి గురవుతుంటే ముక్కు నుంచి ఇన్ఫెక్షన్ చెవికి చేరుకుంటుంది. దీని వలన చిన్న వయసులో వారికి తరచూ చెవి నొప్పి కలుగుతుంది. వయసు పెరిగేకొద్ది వారికి కొంచం జలుబు చేసినా చెవిలో కర్ణభేరికి రంధ్రం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చెవిని, కర్ణభేరి రంధ్రాన్ని పరిశీలించిన తర్వాత డాక్టర్ గారు మీ సమస్యకు తగిన శస్త్రచికిత్స గురించి వివరిస్తారు. సమస్య తీవ్రతను బట్టి శస్త్రచికిత్సను సిఫార్సు చేస్తారు. కర్ణభేరితో పాటు మాస్టోయిడ్ ఎముకకి ఇన్ఫెక్షన్ సోకినా, వినికిడి లోపం ఉన్నా శస్త్రచికిత్స విధానం వేరుగా ఉంటుంది. శస్త్రచికిత్స 1-2.5 గంటల మధ్యలో పూర్తవుతుంది.
వివిధ శస్త్రచికిత్స విధానాలు:
టింపానిక్ పొరపై రంధ్రం లేదా చిల్లులు ఏర్పడినప్పుడు చేసే శస్త్రచికిత్సను టింపనోప్లాస్టీ అంటారు. ఈ శస్త్రచికిత్సలో వైద్యులు చిల్లులు పడిన కర్ణభేరిని సరిచేయడానికి రోగి శరీరం నుండి ఒక చిన్న కణజాలాన్ని తీసుకుని ఆ రంధ్రాన్ని పూరిస్తారు. దీనినే మిరినోప్లాస్టి (Myringoplasty) అంటారు. ఈ విధానం లో శాస్త్రచికిత్స దాదాపుగా 30 నిముషాలలో పూర్తవుతుంది.
మధ్య చెవిలో మూడు చిన్న ఎముకలు ఉంటాయి వీటిని ఓసికిల్స్(ossicles) అని పిలుస్తారు. ఒకవేళ మీ చెవి రంధ్రంతో పాటు ఎముకలు కూడా బాగా దెబ్బతిన్నట్లయితే మీ వినికిడి శక్తి మందగిస్తుంది. ఈ శస్త్రచికిత్స విధానంలో మీ కర్ణభేరిని సరిచేయడమే కాకుండా,దెబ్బతిన్న ఎముకలను సాధారణ మత్తు ఇచ్చి బాగుచేస్తారు అందుకే దీనిని అసిక్యూలోప్లాస్టి అని అంటారు. ఈ శస్త్రచికత్స ద్వారా మీ వినికిడి శక్తి మెరుగవుతుంది.
ఒకవేళ చెవిలో చిల్లులు ఏర్పడి వినికిడి శక్తి తగ్గి, ఇన్ఫెక్షన్ మాస్టాయిడ్ ఎముకకు వ్యాపిస్తే వైద్యులు అనేక శస్త్రచికిత్సలను జరిపేపదులు ఇన్ఫెక్షన్ ని తొలగించి కర్ణభేరి నీ సరిచేయడానికి టింపనోప్లాస్టి, అసిక్యూలోప్లాస్టి మరియు మాస్టోయిడెక్టమీ ని చేస్తారు. ఈ విధంగా ఒకేసారి మూడు శస్త్రచకిత్స లు చేయడం వలన చెవిలోని రంధ్రాలను పూరించడమే కాకుండా మాస్టోయిడ్ ఎముకకు ఉన్న ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా తొలగిస్తారు. ఈ విధానంలో సాధారణ మత్తు ఇచ్చి దాదాపుగా 2-2.5 గంటల సమయంలో శస్త్రచికిత్స ను పూర్తిచేస్తారు.
కర్ణభేరి రంధ్రానికి సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతుంది ?
చెవులు అనేవి మనకి కేవలం ఒక అలంకరణప్రాయం గానే కాదు, మన వినికిడికి, శరీరాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచడానికి కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కర్ణభేరి రంధ్రానికి సరైన చికిత్స లభించకపోతే మధ్యచెవి లో ఇన్ఫెక్షన్లు పెరిగి మన లోపల చెవికి, మెదడుకి కూడా వ్యాపించి వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సరైన సమయంలో నిపుణులైన డాక్టర్ గారిని కలిసి తగిన నిర్ణయం తీసుకోండి.
కొన్ని తీవ్ర పరిణామాలు
కర్ణభేరిలో రంధ్రాలు ఉన్నప్పడు తరచుగా చీము పడుతుంది, దీనిని మందులతో నివారించవచ్చు. నిర్లక్ష్యం చేసి అలాగే వదిలేస్తే ఆ చీము వల్ల మధ్య చెవిలోకి ఇన్ఫెక్షన్ చేరి అక్కడ ఉన్న చిన్న చిన్న ఎముకలను(ossicles) ను అరగదీస్తాయి. అరిగిపోయిన ఎముకల వల్ల వినికిడి శక్తి బాగా తగ్గిపోతుంది దీనినే కండక్ట్యివ్ హియరింగ్ లాస్ అంటారు.
ఇన్ఫెక్షన్ వల్ల మీ లోపల చెవి మరియు శ్రవణ నాడి (auditory nerve) బాగా దెబ్బ తిని క్రమంగా మీ వినికిడి శక్తిని కోల్పోవడాన్ని సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. శస్త్రచికిత్స చేసినప్పటికి, తిరిగి మీ వినికిడి శక్తిని పొందలేరు. వృద్దులలో 90 శాతానికి పైగా వినికిడి లోపానికి ఇది కారణం. ముందే ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తే సమస్య తీవ్రతను తగ్గించి వినికిడి శక్తి ని పొందగలరు.
చెవిలో కర్ణభేరి కి రంధ్రాలు పడిన తర్వాత సరైన శస్త్రచికిత్స లభించకపోతే చీము వల్ల ఫంగస్ ఏర్పడుతుంది. తరచూ డాక్టర్ ని సంప్రదించి దీనిని శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. ఫంగస్ చెవి లో భయంకరమైన నొప్పికి కారణమవుతుంది మరియు మాస్టోయిడ్ ఇన్ఫెక్షన్ కి కూడా దారితీయవచ్చు.
మన లోపల చెవి వినికిడితో పాటు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసే అవయవాలు కలిగి ఉంటాయి. మధ్య చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ లోపల చెవికి వ్యాపించి మన శరీరాన్ని బ్యాలెన్స్ గా ఉంచే అవయవాలను దెబ్బ తీస్తాయి దీనివలన మన శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. కళ్ళు తిరగడం, చలిగాలి తగిలినపుడు తీవ్రమైన ఇబ్బందికి గురవుతారు.
తరచూ ఇన్ఫెక్షన్స్ వల్ల మన చెవిలోపల మెదడుని చెవిని కలిపే ఎముకలు అరిగిపోయి చెవినుంచి మెదడుకి ఇన్ఫెక్షన్ వ్యాపించి పరిస్థితిని తీవ్రం చేస్తాయి.
చెవి లోపల తరచూ ఇన్ఫెక్షన్ వల్ల నరాలు బాగా దెబ్బతిని ఫేషియల్ పెరాలసిస్ రావచ్చు. ఫేషియల్ పరాలసిస్ అంటే మొహంలో ఒక వైపు పెరాలసిస్ వచ్చి నరాలు పట్టు తప్పుతాయి. మొహం ఒక పక్క మమూలుగాను ఒక పక్క సాగిపోయినట్టు ఉంటుంది.
కర్ణభేరికి రంధ్రం పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?
- చెవిలోపల తరచూ ఇయర్ బడ్స్(earbuds), పిన్స్ వగైరా పెట్టడం వలన కర్ణభేరి దెబ్బతింటుంది అందుకని అటువంటివి చెవిలో పెట్టడం మానేయలి. ఒకవేళ చెవిలో గులుం లేదా వాక్స్ ఉంటే డాక్టర్ ని సంప్రదించి ఇయర్ డ్రాప్స్ వేసుకోండి.
- స్కూబా డైవింగ్(scuba diving), లోతైన నదులు, సముద్రాల్లో డైవింగ్ కి(deep sea diving) వెళ్ళినప్పుడు తగినన్ని జాగ్రత్తలు పాటించాలి.
- అకస్మాత్తుగా ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు మీ చెవులను మూసుకోండి. గన్ షాట్స్(gun shots) వంటివి ఆడేటప్పుడు చెవికి రక్షణగా పరికరాలను లేదా కాటన్ ను పెట్టుకోండి.
- తరచూ జలుబు, sinus ఇన్ఫెక్షన్స్ వస్తుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
- చిన్న పిల్లల్లో అడినాయిడ్స్(adenoids/ కొయ్యగడ్డలు), టాన్సిల్స్(tonsils/ గవద బిళ్ళలు) వంటి వ్యాదులకి తరచూ గురవుతుంటే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించి తగిన మందులను వేసుకోవాలి.